పుట:2015.370800.Shatakasanputamu.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసన్నరాఘవశతకము

531


చ.

భరతుఁడు లక్ష్మణుండు నెలబాలుఁడు శత్రునిహంత భక్తితో
నిరవుగ నిల్చి రాఁ బిదప నెంతయు రాముఁడు సత్కటాక్షముల్
పఱపెను వారియందు సతిపంకజనేత్రులఁ జూచెఁ బ్రేమతో
సరసముతోడ నిష్టముల సాగఁగఁ జేసి ప్రసన్న...

185


ఉ.

సన్నిధినున్నయట్టి యలసాధ్వికి కోసలరాజపుత్త్రికిన్
పన్నుగ నాసుమిత్రకును బాగుగ దండముఁ బెట్టి రందఱున్
అన్నము భక్ష్యభోజ్యములు నందఱు గూడియు నారగించి రా
యన్నిట సౌఖ్య మంది రలయాప్తులు గూడి ప్రసన్న...

186


చ.

గురువులకున్ సుకవిప్రముఖకోటికి రాముఁడు మ్రొక్కి నిల్చియున్
అరయఁగ మీకటాక్షమున నన్నిశుభంబులు గల్గె వేడుకన్
దిరముగ దివ్యవస్త్రములు దివ్యసుమాళులు కోర్కి తీఱఁగా
సరగునఁ బంచె నందఱికి సారెకు రాజు ప్రసన్న ...

187


చ.

గురువు వసిష్ఠుఁ డత్రిమునికూటములెల్లను వేదమూర్తులై
పరగెడువారి రాఘవుఁడు భక్తిని మ్రొక్కిన యంతలోపలన్
వరమునివర్గ మెల్లఁ గృప వర్ధిలుమంచును దీవనంబిడన్
సురుచిరమందహాసమున శోభిలె నంత ప్రసన్న...

188