పుట:2015.370800.Shatakasanputamu.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

500

భక్తిరసశతకసంపుటము


ఉ.

అంగనలెల్లఁ గూడి తలలంటిరి వేడ్కను రామచంద్రుకున్
మంగళహారతిచ్చి తగ మజ్జన మాడఁగఁ జేసి రప్పుడున్
పొంగుచుఁ బట్టువస్త్రములు భూషణస్రగ్వరచందనంబులున్
రంగుగఁ దాల్పఁజేసి రలరాముని వేడ్కఁ బ్రసన్న...

61


ఉ.

పెండ్లికుమారుఁ డంచుఁ దగఁ బెట్టిరి బొట్టును కండ్లఁ గాటుకన్
బెండ్లికుమారు రామ యని వేడ్కను బిల్చిరి పెద్ద లందఱున్
బెండ్లికుమారైఁ జేసి కడుఁ బెట్టిరి సొమ్ములు చాల సీతకున్
బెండ్లి కలంకరించియును బేరిమిఁ జూచి ప్రసన్న...

62


చ.

మదగజయాన సీతకును మంగళసూత్రము గట్టి రాముఁడున్
మదనునితండ్రికిన్ మగువ మచ్చికతోఁ దలఁబ్రాలు వోసె యా
ముదితశిరంబున న్బ్రియుఁడు ముత్యములన్ దగ నిల్పి యప్పు డీ
మదవతి కండ్లు చేతులును మాటికిఁ జూచె ప్రసన్న ...

63


ఉ.

దేవతలెల్ల రత్తఱిని దివ్యసుమావళిఁ జల్లు సేయఁగా
భావజరూపుఁ బెండ్లికయి వచ్చిన బంధుజనంబు మెచ్చి రా
భావజమాత సీత తన భావములో రఘు రాము మెచ్చి స
ద్భావముతోడఁ గోర్కులను బాగుగఁ గోరి ప్రసన్న...

64