పుట:2015.370800.Shatakasanputamu.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసన్నరాఘవశతకము

487


ఉ.

దానవులంత దేవతల దారుణకర్మముఁ జేయఁ జూచి పో
వానరులై జనింపుఁడని వారికి గట్టడఁ జేసి లక్ష్మితో
లోన రహస్యముం దెలుప లోకులు సీత యనంగ లంకలో
మానవజన్మ మెత్తి జనమంత వెలుంగఁ బ్రసన్న...

8


ఉ.

తారకబ్రహ్మమూర్తియును ధారుణిలో నొకరూపు నాలుగై
ధీరుడు భానువంశకులదీపుఁ డయోధ్యను నేలురాజుకుం
గారవ మొప్ప వేడ్క గల కారణజన్మము నెత్తి లీలఁగా
భూరమణీవిలాసముగఁ బుట్టఁగఁ దల్చెఁ బ్రసన్న...

9


ఉ.

పుత్త్రులు లేమికి న్వగచి పూర్వవిధానముఁ జేయ జన్నమున్
మిత్త్రుఁడు నగ్నిహోత్రుఁడును మెచ్చి ప్రసాదము నిచ్చినప్పుడే
శత్త్రుపలాయనంబుగను శంఖము చక్రము శేషుఁడున్ హరిన్
పుత్త్రులు నల్గురై వరము పూనిక దీర్పఁ బ్రసన్న...

10


ఉ.

రాముఁడు లక్ష్మణుం డనఁగ రంజిలుచు న్నొకయంశభూతులై
తాము జనించి రాక్షసులదండనఁ జేయఁగ సత్ప్రసిద్ధిగా
రామునిఁ బట్టి పృధ్వి నిఁక రాక్షసులందఱి సంహరించు నా
రాముడె యాదివిష్ణువని యందఱు నండ్రు ప్రసన్న...

11