పుట:2015.370800.Shatakasanputamu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దీవించి యావిభీషణు
     నావిభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా!76
క. గ్రహభయదోషము లొందవు
     బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్‌
     ఇహపర ఫలదాయక విను
     తహతహలెక్కడివి నిన్నుఁదలఁచినఁ గృష్ణా!77
క. గంగ మొదలైన నదులను
     మంగళముగఁ జేయునట్టి మజ్జనములకున్‌
     సంగతి గలిగిన ఫలములు
     రంగుగ మిముఁదలఁచు సాటి రావుర కృష్ణా!78
క. ఆ దండకావనంబున
     కోదండముఁదాల్చినట్టి కోమలమూర్తీ
     నాదండ గావ రమ్మీ
     వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా!79
క. చూపుము నీరూపంబును
     బాపపు దుష్కృతము లెల్లఁ బంకజనాభా
     పాపుము నాకును దయతో
     శ్రీపతి నిను నమ్మినాఁడ సిద్ధము కృష్ణా!80
క. నీ నామము భవహరణము
     నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్‌
     నీ నామ మమృత పూర్ణము
     నీ నామము నేఁదలంతు నిత్యము కృష్ణా!81