పుట:2015.370800.Shatakasanputamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     బలమెవ్వఁడు రవిసుతునకు
     బలమెవ్వఁడు నాకు నీవ బలమౌఁ గృష్ణా!65
క. పరుసము సోకిన యినుమును
     వరుసగ బంగారమైన వడువున జిహ్వన్‌
     హరి నీ నామము సోకిన
     సురవందిత నేను నటుల సులభుఁడ గృష్ణా!66
క. ఒకసారి నీదునామము
     ప్రకటముగాఁ దలఁచువారి పాపము లెల్లన్‌
     వికలములై తొలఁగుటకును
     సకలార్థ యజామిళుండు సాక్షియె కృష్ణా!67
క. హరి సర్వంబునఁ గలఁ డని
     గరిమను దైత్యుండు పలుకఁ గంబములోనన్‌
     ఇరవొంది వెడలిచీల్చవె
     శరణనఁ బ్రహ్లాదుడిండు సాక్షియె కృష్ణా!68
క. భద్రార్చిత పదపద్మ సు
     భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ
     భద్రాధిప కేశవ బల
     భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా!69
క. ఎటువలెఁ గరిమొఱ వింటివి
     ఎటువలెఁ బ్రహ్లాదు కభయమిచ్చితి కరుణన్‌
     అటువలె నను రక్షింపుము
     కటకట నినునమ్మినాఁడ గావుము కృష్ణా!70