పుట:2015.370800.Shatakasanputamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దిక్కెవ్వ రయ్యహల్యకు
     దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా!54
క. హరి నీవె దిక్కు నాకును
     సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్‌
     బరమేష్ఠి సురలు పొగడఁగ
     కరిఁ గాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా!55
క. పురుషోత్తమ లక్ష్మీపతి
     సరసిజగర్భాది మౌనిసన్నుతచరితా
     మురభంజన సురరంజన
     వరదుఁడ వగు నాకు భక్త వత్సల కృష్ణా!56
క. క్రతువులు తీర్థాటనములు
     వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ
     పతి మిముఁ దలచినవారికి
     నతులితపుణ్యములు గలుగు టరుదే కృష్ణా!57
క. స్తంభమున వెడలి దానవ
     డింభకు రక్షించినట్టి రీతిని వెలయన్‌
     అంభోజనేత్ర జలనిధి
     గంభీరుఁడ నన్నుఁ గావు కరుణను గృష్ణా!58
క. శతకోటి భానుతేజా
     యతులితసద్గుణగణాఢ్య యంబుజనాభా
     రతినాథజనక లక్ష్మీ
     పతిహిత ననుఁ గావు భక్త వత్సల కృష్ణా!59