పుట:2015.370800.Shatakasanputamu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. నరపశువ మూఢచిత్తుఁడ
     దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
     గుఱు తెఱుఁగ నెంతవాడఁను
     హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా!49
క. పరనారీ ముఖపద్మము
     గుఱుతుగఁ గుచకుంభములను గొప్పును నడుమున్‌
     అరయంగనె మోహింతురు
     నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా!50
క. పంచేంద్రియమార్గంబులఁ
     గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్‌
     ఇంచుక సజ్జన సంగతి
     నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడె కృష్ణా!51
క. దుష్టుండ దురాచారుఁడ
     దుష్టచరిఁత్రుఁడను చాల దుర్బుద్ధిని నేఁ
     నిష్ట నిను గొల్వనేరను
     కష్టుఁడ నగు నన్ను కావు కరుణను గృష్ణా!52
క. కుంభీంద్రవరద కేశవ
     జంభాసురవైరి దివిజ సన్నుత చరితా
     అంభోజనేత్ర జలనిధి
     గంభీరా నన్నుఁ గావు కరుణను గృష్ణా!53
క. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
     దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్‌