పుట:2015.370800.Shatakasanputamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. అందఱు సురలును దనుజులు
     పొందుగ క్షీరాబ్ధిఁ దఱువఁ బొలుపున నీ వా
     నందంబుగఁ గూర్మమవై
     మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా!38
క. ఆదివరాహమ వయి నీ
     వా దనుజు హిరణ్యనేత్రు హతుఁజేసి తగన్‌
     మోదమున సురలు పొగడఁగ
     మేదిని వడి గొడుగునెత్తి మెఱసితి గృష్ణా!39
క. కెరలి యఱచేతఁ గంబము
     నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్‌
     ఉరమును జీరి వధించితి
     నరహరి రూపావతార నగధర కృష్ణా!40
క. వడుగవునై మూఁడడుగుల
     నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్‌
     తొడిగితివి నీదు మేనునఁ
     గడు చిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా!41
క. ఇరువదొకమాఱు నృపతుల
     శిరములు ఖండించితౌర చేగొడ్డంటన్‌
     ధరఁ గశ్యపునకు నిచ్చియుఁ
     బరఁగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా!42
క. దశకంఠునిఁ బరిమార్చియు
     గుశలముతో సీతఁదెచ్చి కొనియు నయోధ్యన్‌