పుట:2015.370800.Shatakasanputamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. అంసాలంబితకుండల
     కంసాంతక నీవు ద్వారకాపురిలోనన్‌
     సంసారి రీతినుంటివి
     [1]సంసాదితవైరి సత్ప్రశంసిత గృష్ణా!22
క. పదియాఱువేల నూర్వురు
     సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్‌
     విదితంబుగ బహురూపుల
     వదలక భోగింతువౌర వసుధను గృష్ణా!23
క. అంగన పనుపున దోవతి
     కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
     సంగతి విని దయనొసఁగితి
     రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా!24
క. హా వసుదేవకుమారక
     కావుము నా మాన మనుచు కామిని వేఁడన్‌
     ఆ వనజాక్షికి నిచ్చితి
     శ్రీవర యక్షయ మటంచు జీరలు కృష్ణా!25
క. శుభ్రమగు పాంచజన్యము
     [2]నభ్రంకషమగుచు మ్రోవ నాహవభూమిన్‌
     విభ్రమలగు దనుజసుతా
     గర్భంబుల పగులఁజేయు ఘనుడవు కృష్ణా!26

  1. అసురాదినరేంద్రవైరి యచ్యుత - ముద్రితప్రతిపాఠము
  2. అభ్రంబులపగిది - ముద్రితప్రతి