పుట:2015.370800.Shatakasanputamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     బాణీముత్యము ముక్కున
     నాణెముగాఁదాల్చు లోక నాథుఁడ కృష్ణా!16
క. మడుగుకుఁ జని కాళీయుని
     పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయన్‌
     గడువేడుకతో నాడెడు
     నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా!17
క. బృందావనమున బ్రహ్మా
     నందార్భకమూర్తి వేణు నాదము నీ వా
     మందార మూలమున గో
     విందా పూరింతువౌర వేడుకఁ గృష్ణా!18
క. వారిజ నేత్రలు యమునా
     వారిని జలకంబులాడ వచ్చిన నీ వా
     చీరలు మ్రుచ్చిలి యిచ్చితి
     నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా!19
క. దేవేంద్రుఁ డలుకతోడను
     వావిరిగా ఱాళ్ళవాన వడిఁ గురియింపన్‌
     గోవర్ధనగిరి యెత్తితి
     గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా!20
క. అండజవాహన విను బ్ర
     హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
     కొండల నెత్తితి వందురు
     కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణా!21