పుట:2015.370800.Shatakasanputamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     దరికొని మండుచుండు శిఖదార్కొనినన్‌ శలభాదికీటకో
     త్కరము విలీనమై చనదె దాశరథీ! కరుణాపయోనిధీ!81
చ. హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్‌
     మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారవశ్యుఁడై
     పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
     దరమున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!82
చ. వనకరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
     వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో
     మనికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా
     ధనములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!83
చ. కరములు మీకు మ్రొక్కులిడఁ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
     స్మరణఁ దనర్ప వీనులు భవత్కథలన్‌ వినుచుండ నాస మీ
     యఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో
     త్కరమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ!84
చ. చిరతరభక్తి నొక్కతులసీదళ మర్పణ సేయువాఁడు ఖే
     చరగరుడోరగ ప్రముఖసంఘములో వెలుఁగన్‌ సదాభవత్‌
     స్ఫురదరవింద పాదములఁ బూజలొనర్చినవారికెల్లఁ ద
     త్పర మఱచేతిధాత్రిగద దాశరథీ! కరుణాపయోనిధీ!85