పుట:2015.370800.Shatakasanputamu.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     స్ఫురదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం
     ధరసమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!9
చ. కనకవిశాలచేల భవకాననశాతకుఠారధార స
     జ్జనపరిపాలశీల దివిజస్తుతసద్గుణకాండ కాండసం
     జనిత పరాక్రమ క్రమవిశారద శారద కందకుంద చం
     దనఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ!10
ఉ. శ్రీరఘువంశ తోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి
     త్రోరుపదాబ్జముల్‌ వికసితోత్పల చంపకవృత్తమాధురీ
     పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెద జిత్తగింపుమీ
     తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!11
చ. గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్‌
     సరసులమాడ్కి సంతసిల జాలుదురోటు శశాంకచంద్రికాం
     కురముల కిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ
     ధరమున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ!12
చ. తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స
     ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
     బరుగుచువంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్త్వముం
     దరమె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణాపయోనిధీ!13