పుట:2015.370800.Shatakasanputamu.pdf/194

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

భద్రాచలరామదాసకవికృత

దాశరథిశతకము

ఉ. శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
     గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
     ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
     త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!1
ఉ. రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
     స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
     శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
     ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!2
చ. అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
     విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
     ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
     ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!3
ఉ. రంగదరాతిభంగ ఖగరాజతురంగ విపత్పరంపరో
     త్తుంగ తమఃపతంగ పరితోషితరంగ దయాంతరంగ స
     త్సంగ ధరాత్మజాహృదయసారసభృంగ నిశాచరాబ్జమా
     తంగ శుభాంగ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!4