పుట:2015.370800.Shatakasanputamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

     కామాంబకు గోపన్న జనించెను
     కమలాకుని వరముననూ
     ఆత్రేయసగోత్రంబున కంచె
     ర్లాంధ్రులవంశమునన్
     పుత్రుఁ డగుచు లింగనమంత్రి కిఁ దాఁ
     బుట్టెను గోపన్ననఁగన్.

అని వ్రాసియున్నాడు. ఇందలి వంశానుక్రమణిక దాశరధీశతకములోని కంచర్ల గోపన్న వంశానుక్రమణికకు సర్వవిధముల సరిపోవుచున్నది. నూటయిరువది సంవత్సరములనుండి గ్రంథస్థమైయున్న కంచర్ల గోపన్న రామదాసు నొక్కఁడే యను ప్రవాదము రామదాసుఁడు నేలకొండపల్లి వాస్తవ్యుడను ప్రవాదము గ్రఁథస్థములై యుండుటవలన సత్యదూరములని తలంప వీలుపడదు.

రామదాసు దాశరథిశతకమునేగాక కొన్ని గేయములుగూడ రచించెను. అవి మనోహరమగు ధారతో భక్తిరసమును వర్షించుచు నాంధ్రదేశమునందలి యాబాలగోపాలముచేఁ బఠింపఁబడుచున్నవి. అన్నిఁటికంటె రామదాసకృతమగు దాశరథీశతకప్రశస్తి యాంధ్రలోకమున నిండియున్నది.