పుట:2015.370800.Shatakasanputamu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జేసెను. తరువాత క్రమముగ నిందు మానవజన్మసందర్భము, బాల్యకౌమారయౌవనాద్యవస్థలు, పిదప గురూపదేశమువలన మోక్షధర్మములు గ్రహించువిధము, మనోహరముగ వర్ణింపఁబడెను.

ఇందు భగవద్గీతాది వేదాంతగ్రంథములలోఁ బ్రతిసాదింపఁబడిన తత్త్వరహస్యములు సుబోధములగు తేటతెలుఁగుమాటలతో వివరింపఁబడుటచే వేదాంతశాస్త్రానుభవము స్వయంకృషితో నార్జింప నెంచిన స్త్రీ బాలుర కిది యనుకూలము. విషయప్రవేశమునకు సులభమార్గముఁ జూపుచున్నది.

చిదచిదీశ్వరభావములు, మాయాస్వరూపము, దృగ్దృశ్యములు, ప్రకృతిస్వరూపము, తత్త్వములు, పంచీకరణము, గురుశిష్యధర్మములు లోనగుమహత్తరవిషయము లింత సులభమగు శైలిలో గేయముగ వ్రాసి ప్రాకృతజనులు తరించు త్రోవఁ జూపిన గ్రంథకర్త ప్రశంసాపాత్రుఁడు.

శతకము వ్రాసిన కవి పేరుగాని కాలముగాని గుఱుతింప నాధారములు కానరావు.

నందిగామ.ఇట్లు భాషాసేవకులు,
1-1-26.శేషాద్రిరమణకవులు,
శతావధానులు.