పుట:2015.370800.Shatakasanputamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. తెగువన్నిర్జరులన్‌ జయించుచు మదోద్రేకంబునన్‌ గానలో
     మృగనేత్రిన్‌ ధరణీతనూజ నసురు ల్మెచ్చంగఁ దాఁదెచ్చి నె
     వ్వగలం బెట్టి విధిప్రయత్నమున నిర్వంశంబుగా రాముచే
     జగతిం గూలఁడె యాదశాననుఁడు కృష్ణా! దేవకీనందనా!63
మ. పరనారీహరణం బొనర్చినమహాపాపాత్ముఁ డారావణుం
     డరయ న్నాతని తమ్ముఁడైన దనుజుం డత్యంతసద్భక్తితో
     శరణన్నం దయఁజూచి యగ్రజునిరాజ్యం బిచ్చి రక్షింప వా
     సరణిన్‌ నీపదభక్తియే ఘనము కృష్ణా! దేవకీనందనా!64
మ. వెఱచైనన్‌ మఱచైనఁ గార్యముతఱిన్‌ వేసారుచున్నైన యా
     దరమొప్పైనను మాయనైన నృపతుల్‌ దండింపఁగా నైననున్‌
     పరిహాసంబుననైన మిమ్మునుడువన్‌ బ్రాపించు పుణ్యాత్మకుల్‌
     నరకావాసముఁ జేరరా ఘనులు కృష్ణా! దేవకీనందనా!65
మ. నొసటన్‌ గన్నులఁగట్టి వేల్పుసతి నెంతోభక్తితోఁ జూఁడఁగా
     నిసుమంతైన భయంబులేక తలమీఁ దెక్క న్నదట్లుండనీ
     వసుధన్‌ భర్తను స్త్రీల కెవ్వరయినన్‌ వశ్యాత్ములై మట్టులే
     కస మియ్యం దల కెక్క కుండుదురె కృష్ణా! దేవకీనందనా!66