పుట:2015.370800.Shatakasanputamu.pdf/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ కృష్ణాయ నమః

వెన్నెలకంటి జన్నయ్యమంత్రికృత

దేవకీనందనశతకము

శా. శ్రీకైవల్యరమాధినాథ నిను నర్థిం గీర్తనల్‌జేసి కా
     దా కంజాతభవేంద్ర నారద శుకవ్యాసాంబరీషార్జునుల్‌
     నీకారుణ్యముఁ గాంచుటల్‌ ననుమతిన్‌ నేనెంతధన్యుండనో
     నాకుఁ జేకురె నట్టిభాగ్యములు కృష్ణా! దేవకీనందనా!1
శా. శ్రీవైకుంఠనివాసగోత్రధర లక్ష్మీనాథ గోపాల లీ
     లావిర్భావ పతంగవాహ యదువంశాంభోధిచంద్రోదయా
     నీవే దిక్కని యున్నవాఁడను దయన్‌ వీక్షించి రక్షించవే
     నావిజ్ఞాపన మాలకించు మది కృష్ణా! దేవకీనందనా!2
శా. శ్రీరామావసుధాకళత్రములపైఁ జెన్నొందు పాదాబ్జముల్‌
     గారామారఁగఁ జూచి శేషఫణి దాఁ గౌతూహలంబొప్పఁగా
     క్షీరాంభోనిధిఁ బవ్వళించి యమరుల్‌ సేవింపఁగా నొప్పుని
     న్నారాధింతు మదీయచిత్తమునఁ గృష్ణా! దేవకీనందనా!3