పుట:2015.370800.Shatakasanputamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. కనుఁగొన్నప్పుడె గుప్పఁడే కుజనులం గాలుండు కాలుండు పొం
     డనుచున్ రౌరవనారకాగ్నులఁ బడన్ హత్తించి, యయ్యగ్నుల
     న్మునుఁగం జాలఁ బరేతరాజునకు న న్నొప్పింపఁగాఁ బోవ కు
     గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!38
మ. నిను సేవించెద నంచుఁ గోరుకొనియున్నేన్ వానికిం బూర్వక
     ర్మనిమిత్తంబులు కష్టముల్ గలుఁగఁగా మన్నించి నీవడ్డ మౌ
     దని చెప్పంబడు, ద్రౌపదిం గరినిఁ బ్రహ్లాదున్ ధ్రువున్ మున్ను బో
     రన రక్షించుట కల్దొ లేదొ రఘువీరా! జానకీనాయకా!39
మ. అనిశంబున్ నినుఁ గొల్చు మానవులు ప్రాణాంతంబునన్ రోగబా
     ధ నిమిత్తంబున రామరామ యనుచున్ దల్పంగ లేకుండినన్
     జననాథాగ్రణి! నీవు వారి రసనాస్థానంబున న్నిల్చి బో
     రన రామా! యనిపింతు వౌర! రఘువీరా! జానకీనాయకా!40
మ. ఇనవంశోత్తమ! వేదశాస్త్రములలో నే వింటి నేవింటి వాఁ
     డును నీకుం బ్రతిగాఁడు, నీకుఁ గల బంటు, న్నన్ను రక్షింపు; కా
     లుని బంట్లన్ విదళింపఁగా వలయు, నాలో నుండుమీ గండుమీ
     ఱ నమోఘాస్త్రము విల్లుఁ బూని రఘువీరా! జానకీనాయకా!41
మ. జననాథాగ్రణి! నిన్నుఁ గొల్చునతఁ డాచండాలుఁడైనం బున
     ర్జననం బొందక ముక్తిఁ గాంచు నొనరన్ సద్భక్తుఁడైనం దుదిన్,