పుట:2015.370800.Shatakasanputamu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామస్తుత్యాత్మకము లైన యిందలి పద్యములు మిగుల రసవంతములు. ఎల్లకడల వ్యాపించి ప్రసిద్ధి కెక్కినవి. శ్రీకృష్ణరాయల యాస్థానమునఁ బ్రసిద్ధుఁ డగు రామభద్రకవి ప్రశంసించుట యీశతకప్రఖ్యాతిని వెలయించుచున్నది. నేఁటి వ్యాకరణములకు సరిపడని ప్రయోగములు కొన్ని యిందు గలవు. భారతభాగవతములయందలి పద్యములరచనముతో సరివచ్చిన పద్యములు కొన్ని యిందుఁ గలవు. ఇంకను దీనియందలి గుణవిశేషములఁ జదువరులే తెలియఁగలరు. ఇ ట్లనేకప్రాచీనగ్రంథములను వ్యయప్రయాసములను లెక్కింపక ముద్రించి విద్యాభిమానులకు సులభసాధ్యములుగఁ జేయు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగా రెంతయుఁ బ్రశంసార్హులు.

గన్నవరపు సుబ్బరామయ్య.