పుట:2015.329863.Vallabaipatel.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
75
వల్లభాయిపటేల్

రించ వచ్చునని యప్పుడు మేము నిశ్చయించితిమి. దేశ విభజనవల్ల మనము చాలబాధలకు లోనైతిమి. శరీరములో నొక యంగమును ఖండించి వేసినట్లైనది. కాని దేశవిభజన కామోదించియుండనిపక్షములో నేర్పడియుండు పరిస్థితులలోఁ బోల్చి చూచిన నిది చాలా నయమని చెప్పవలయును.

"అందువల్ల దేశవిభజన కంగీకరించినందుకు నే నేమియుఁ జింతించుటలేదు. దేశవిభజనకుఁ బూర్వమున్న విధముగానే వ్యవహరించుచు దేశవిభజన నంగీకరించకపోయిన మన మింకను బెక్కు దురవస్థలపాలై యుండువార మని ప్రభుత్వ నిర్వహణలో నేను బొందిన యనుభవమునుబట్టి యిప్పుడిప్పుడు నేను నిర్ణయించుకొనుచున్నాను.

ఇండియావ్యవహారములో పాకిస్థాన్ జోక్యము

"చిఱిగిన చదరవలెఁ బాకిస్థాను దమకు సిద్ధించినదని చెప్పుచు బాకిస్థాన్ నాయకులు కాపట్యముతోనే దేశవిభజన కంగీకరించిరి. వారు దుర్బుద్ధితో నున్నారని మనపట్ల నవిశ్వాసముతోనే వ్యవహరించుచున్నారని మాకుఁ దెలియును. అదే నిజమై యదను చిక్కినప్పు డిండియాపై దండెత్తవలయునని వారు తలపోసినట్లయిన నట్టి పరిస్థితి నెదుర్కొనుటకు మనము సర్వసన్నద్ధముగా నుండవలయునని మేము గ్రహించితిమి. పాకిస్థాన్ సాధన యత్నములోనే బయటవారి తోడ్పాటు వారి కున్నప్పుడు, పాకిస్థాన్ సిద్ధించిన పిమ్మటఁగూడ వారి దుష్కృత్యముల కా తోడ్పాటుండితీరునని మనకుఁ దెలియును. అందువల్ల మన దేశమును సమైక్యపఱచి, సుసంఘటితముచేయుట యత్యావశ్యకమైనది.