పుట:2015.329863.Vallabaipatel.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

59

భారతదేశమునకు వన్నె దెచ్చిన వీరులలో నేయొక రొక చోటఁ జేరినను నద్భుతమైన వెలుఁగు నందీయఁగలరు. అట్టి వీరందరు నొకచోటఁగలసి కాలము గడుపుచుండగా నెంతటి జ్యోతి కాంతు లీనుచుండునో !

అహమ్మద్‌నగరు కోటతలుపులు త్రోసికొని లోపలికిఁ బోఁగానే కుడిప్రక్క గదులలో వరుసగా వీరి కాపురములు - మొదటిగది సర్దార్‌జీది. కారాగృహములో నున్నను బయట నున్నను నాయన ప్రధానస్థాన మాయనకుఁ దప్పదు. రెండవది రాష్ట్రపతి ఆజాదుది. తరువాత ఆసఫ్‌ఆలీది. అనంతరము నెహ్రూపండితునిది. డాక్టర్ సయ్యద్ అహమ్మద్‌జీ యక్కడ నుండఁగా వీరిగదిలోనే యుండువాఁడు. అయిదవగది గోవిందవల్లభపంతుది. ఆఱు శంకర రావ్ దేవు. ఏడవది డాక్టర్ ఘోష్, ఎనిమిది పట్టాభి, తొమ్మిది కృపలానీ, పది ఆచార్య నరేంద్ర దేవు, పదనొకండవది హరికృష్ణ మెహతాబ్ - తరువాత వంటగది.

ఈ గదుల కెదురుగానుండు వరుసలో జైలు అధికారు లుందురు. వర్కింగుకమిటీ సభ్యుల సౌకర్యములు చూచుటకొఱకు యఱ్ఱవాడ జైలునుండి తెచ్చిన 13 మంది ఖైదీలుకూడ నక్కడ నుండిరి.

కోట మొత్తముమీఁద నొక్కటన నొక్కటే వృక్షమున్నది. అది సర్దార్‌జీ గది ముందున్నది. ఆయనతో నేమి పోలికలు పోల్చికొందమనియో, మఱి! లేకపోయిన సర్దార్‌జీ హాస్యమునకు నవ్వుకొనుచు నాయనకుఁ జల్లగాలి విసరుచు నుండుటకొఱకుఁ గాబోలు!