పుట:2015.329863.Vallabaipatel.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
54
వల్లభాయిపటేల్

నేకాభిప్రాయులమై యున్నాము. కాని స్వాతంత్ర్యప్రాప్తి విషయములోమాత్రమే మా యభిప్రాయములు భేదించినవి. అప్పటికప్పుడే స్వాతంత్ర్యమును బొందితీరవలయునని నే నభిప్రాయపడితిని. ఎంతో హృదయసంశోధనము చేసికొన్నపిమ్మటఁ గాని, యెంతో విచారించిన పిమ్మటగాని, నేనీ నిర్ణయమునకుఁ రాలేదు దేశవిభజనకుఁగనుక నంగీకరించకపోయిన పక్షములో భారతదేశమంతయు ఛిన్నభిన్నమై సమూలముగా నశించిపోవునని నాకుఁ దోఁచినది........ కాని గాంధీజీ యీ నిర్ణయముతో నేకీభవించలేదు. కాని యీ నిర్ణయము సరియైనదే యని, దోషరహితమైనదని, నామనస్సునకు విశ్వాసము కలిగినట్లయిన నాలాగే వ్యవహరించవలసినదని గాంధీజీ నాకుఁజెప్పెను. తనవారసుఁడుగా గాంధీజీ నిర్ణయించిపోయిన మహాపురుషుని సాహచర్యము నా కుండనే యున్నది. మా నిర్ణయమును గాంధీజీ ప్రతిఘటించలేదు. అయిన నాయన దాని నామోదించలేదు. ఆనాఁడు మే మట్టి నిర్ణయము చేసినందు కీనాఁడుకూడ నే నేమియుఁ బశ్చాత్తాపము పడుట లేదు. కాని మన సహోదరులు కొంతమంది మననుండి వేఱుపడిపోయినందులకుఁ జింతించితిమి.

మహాత్ముని మరణానంతరము ప్రజలకు సర్దారు పటేలు చేసిన యుద్బోధ స్మరింపఁదగినది. దానిలోని కొన్ని భాగాలు.

"ఈరోజు జరిగిన యీ సంఘటనకు మనము విచారమును వెలిబుచ్చవలసినదే కాని క్రోధమును జూపఁగూడదు. క్రోధము వచ్చిన నది మానవులను మఱపించును. ఇంతవఱకును మనము నేర్చుకొన్న మహాత్ముని బోధన లన్నిటిని, విస్మరింపఁజేయును.