పుట:2015.329863.Vallabaipatel.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

వల్లభాయిపటేల్

గాంధీజీ యన మణిబెన్‌కు భగవంతుఁడని నమ్మకము. అందుచేతనే యాయన యాశీర్వాదము పొందుటలో, నాయన చెప్పినచొప్పున యక్షరాలఁ బ్రవర్తించుటలో, నామె ప్రసిద్ధురాలు. గాంధిమహాత్ముఁడు, లోకప్రఖ్యాతిఁ గాంచిన రాజకోట సమరముసాగించు రోజులలోఁ గస్తూరిబాతోపా టా యుద్ధములోనికి దుమికిన దీ వీరాంగన. తండ్రికిఁ దాను భక్తిగల కుమార్తెయై సేవచేయుటమాట యట్లుంచి, యాయన కెప్పుడు నండగా నిలచి రాజకీయములలో నెన్నోవిధములఁ దోడ్పడుచుండును మణిబెన్. మహాదేవ్ దేశాయి గాంధీజీకి, హుమాయూన్ కబీరు అబ్దుల్‌కలాం అజాద్‌కు, ఉపాధ్యాయ నెహ్రూకుఁ గార్యదర్శులై వారి ప్రతిభలను ధారవోసి, వారి నాయకుల కీర్తిఖ్యాతులకుఁ బాటుపడినట్లే, సర్దార్ జీకి మణిబెన్ కార్యదర్శినియై తండ్రికిఁ దగినఖ్యాతిఁ దెచ్చినది.

ఆమె యాయనకుఁ గార్యదర్శినియేకాదు. అంగరక్షకురాలుకూడ. అంగరక్షకురాలేకాదు. తనయయై, తల్లియై, సర్దార్ పటేలున సాకుచున్న సేవావ్రతురాలు.

ఆయన యాహారవిహారములలో జాగ్రత్తఁ దీసికొని యాయన యారోగ్యమును గాపాడుటేగాక, దర్శకుల కనుమతి నిచ్చి యాయన కలసటలేకుండ ననుక్షణ మధికజాగ్రత దీసికొనుచుండు దాది.

వేయేల? ఆయన కామె కార్యదర్శిని, అంగరక్షకురాలు, తనయ, సమాలోచనకర్త్రి, సలహాదారు.

ఆమె వర్కింగు కమిటీ సభలకేకాదు, మంత్రాలోచన సభలకుఁగూడ వెళ్లునందురు. తండ్రిని విడచి యామెయుండదు.