పుట:2015.329863.Vallabaipatel.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

వల్లభాయిపటేల్

గపు పశుసంతానము, వారి హస్తములనుండి పరాయివారికిఁ బోవలసివచ్చెను. పఠానులు చేయు రాక్షసకృత్యములకుఁ బరిమితి లేకుండెను. ఏమైనప్పటికి రైతాంగపు స్త్రీ పురుషు లద్భుత ధైర్య శాంతములతో నన్నియు సహించుచుండిరి. ఆ బార్డోలీ దృశ్యములను జూచుటకుఁ బోయిన ప్రముఖులు సర్దారుయొక్క యద్భుత నిర్మాణనిపుణత్వమును, సంఘటనా శక్తిని ప్రజల త్యాగమార్గమును జూచి, విస్మయ చకితులైరి.

బార్డోలీ సత్యాగ్రహము యావద్భారత సమస్యగాఁ బరిగణింపబడి యన్నిప్రాంతములనుండి యన్నివిధముల సహాయము సమకూరసాగెను.

ప్రభుత్వమున కన్ని వైపులనుండి యొత్తిడి కలుగుటచేతఁ జివరకు రాజీబేరమునకు రాక తప్పలేదు. వై స్రాయి గవర్నరును బిలిపించుటయు గవర్నరు వల్లభాయికిఁ గబురుచేయుటయు జరిగినది. వల్లభాయి మఱి ముగ్గురు మిత్రులతోఁగూడ సూరత్ లో గవర్నరును గలసికొన్నాఁడు. కలసిమెలసి వారు మాట్లాడినారు, కాని కార్యకారి కాలేదు. శాసనసభాసభ్యులు కొందరు రాజీమార్గముచేయఁ బ్రయత్నించిరి. ఈ సందర్భములో శాసన సభాసభ్యుడగు రామచంద్రభట్టు పన్నులవిధానము పునర్విచారణ జరుగువఱకుఁ బెంపు జేసిన మొత్తము నొకచోటఁ బెట్టుటకు సూచనచేసెను. గవర్నరు దీని నంగీకరించెను. అంతట రాజీజరిగెను. ప్రభుత్వము తిరిగి పునర్విచారణ చేయుటకుఁ బ్రకటించెను. ఇట్లు ప్రకటించుటయేగాక ప్రభుత్వము వారు జప్తుచేసిన భూమిని రైతులకుఁ దిరిగి యిచ్చి యీ సందర్భములో నిర్భంధింపఁబడినవారి నందఱను విడుదల జేసిరి.