పుట:2015.329863.Vallabaipatel.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

155

యాయన యన్న మిక్కిలి భయపడును. ఎందుచేతనన నాయన యెవ్వరి వెంటఁబడునో వానిని నామరూపములు లేకుండఁజేసి విడిచిపెట్టగలఁడు. నిర్మాణములోను, గార్యనిర్వహణలోను నాయనలో నపూర్వశక్తి గలదు. గుజరాతులో నాయనను బ్రతిఘటించు పురుషుఁడు పుట్టలేదు.

కర్షకుల కాశాజ్యోతి

వీని యన్నిటికిమించి వల్లభాయి కిసానుల హృదయమును గనుగొన్నాడు. భారతదేశమునకు సరియైన ప్రతినిధులుగా వారిని గ్రహించి వారిని దనవారిగా నెంచెను. ఆయన కిసానులను బాగుగా దెలిసికొన్నాడు. రైతు లాయనను బూర్తిగా గ్రహించినారు. కాకా కలేల్క రిట్లు వ్రాసెను. "రైతాంగము వ్యాకులహృదయ మైనప్పుడు వల్లభాయి రక్తముపొంగును. ఈ బాధా హేతువువలననే యాయన గ్రామములను దన కార్యక్షేత్రముగా గావించి రైతుల నాత్మీయులుగా భావించుటయేకాక యాయనయే కృషీవలుఁడైనాడు. కైరా, బోర్సద్, బార్డోలీ - యివియన్నియు నిందు కుదాహరణములు. ఆయనవలె రైతాంగమునకుఁ బ్రత్యక్షముగా నింత సహాయము చేసిన నాయకులు భారతీయనాయకవర్గములోలేరు. ఆయన భారతీయకర్షకుల యాశాజ్యోతి-ఆయనను గుఱించి "జోనాబేలీ"రచించిన యీ పంక్తులు నిత్యసత్యములు.

               Even to the dullest peasant standing by
               Who fasten'd still on hims wandering eye,
               He seemed the master-spirit of the land.

వల్లభాయి కాంగ్రెసుయొక్క సంఘటనాత్మక ప్రతిభా శక్తులకుఁ జిహ్నము.