పుట:2015.329863.Vallabaipatel.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

వల్లభాయిపటేల్

గాంధీజీ నిర్ణయించిన తర్వాత దానికి దోసిలొగ్గెడువాఁడు. వీరిద్దరుకూడఁ బ్రస్తుత మింత యుచ్చస్థితిలో నుండుటకు గాంధీజీయే కారణము. ఎంతో యోచనచేసియే గాంధీజీ పటేల్‌ను గుజరాత్‌లోఁ దనప్రధానానుచరుఁడుగా నిర్ణయించుకొనెను. అట్లు నిర్ణయించిన తర్వాత నాయనపట్లఁ జాలవిశ్వాస ముంచెను. సర్దార్ రాజకీయ ప్రతిష్ఠకు, నధికారమునకు నిదే తొలిమెట్టు.

భారతదేశ నాయకత్వము నెహ్రూకుఁగూడ గాంధీజీ వల్లనే లభించినది. లాహోర్ కాంగ్రెసు కధ్యక్షుడుగా - బహుశః చరిత్రలో నింత చిన్న వాఁ డెవ్వడు నధ్యక్షుఁడై యుండఁడు - నెహ్రూను నిలబెట్టినది గాంధీజీయే. గాంధీజీనైతిక శక్తియేఁ దన వెనుక లేక పోయినచో నెహ్రూ కాంగ్రెస్ యంత్రములో తన ప్రతిష్ఠ నిలఁబెట్టుకోలేకపోయెడివాఁడే. పండిట్ నెహ్రూ యెప్పుడు పార్టీతంత్రములకు, నోట్ల నర్థించుట కిష్టపడఁడు. ఈయనకు గాంధీజీ యీపని చేసెడివాఁడు. చాల విధములుగా గాంధీజీ వల్లనే నెహ్రూ చెడిపోయినాఁడు.

భిన్న విధానములు

ఈ నాయకు లిద్దరి దృక్పథములలోఁగూడఁ జాలవిభేదము లున్నవి. నెహ్రూ యొకవిధమైన ఫేబియన్ సోషలిస్టు. అంతర్జాతీయవాది. చాల సమస్యలపట్ల నతనివైఖరి యతివాదధోరణిలో నుండును. పాశ్చాత్యసంస్కృతి, యలవాట్లన్న నతనికిఁ జాలమోజుకూడ. సంస్కృతి యలవాట్ల విషయములోఁ బటేల్ కేవలము భారతీయుఁడు. ఆయన యే యిజము'లోను నమ్మక ముంచనంతటి చతురుఁడని చెప్పవచ్చును.