పుట:2015.329863.Vallabaipatel.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

వల్లభాయిపటేల్

మునఁ గ్లిష్టసమయమున నాయన వాస్తవికదృక్పథము బాగుగా నుపయోగపడినది. ఆయన కడుదృఢస్వభావుఁడు. కాంగ్రెసు సంస్థలో యూరపియన్ దృక్పథముతోఁ జూచిన, నాయన యొక్కఁడే గొప్ప రాజకీయవేత్త. ఆయన భారతదేశపు బిస్మార్కు. వ్యక్తిగతముగా నాయన భీకరుఁడు. ఎదుటివారికి భయావహుఁడు. కాని యాయన నెఱిఁగినవా రాయనలో ననేక గుణములను బ్రేమింపకపోరు. ప్రతివిషయము జాగ్రత్తగా నుద్విగ్నుఁడుగాకుండ నాలోచించును. సోషలిజమన్నను సోషలిస్టులన్నను నాయనకుఁ దలనొప్పి.

విరుద్ధశక్తులు

నెహ్రూ యేకాంతవాసప్రియుఁడు. కాంగ్రెసులో వర్గ విభేదముల కాయల యతీతుఁడుగా నుండుట యలవాటయి పోయినది. ఆయన రాజకీయపు పెంపకమాయనకుఁ గుతంత్రము లన్న ననిష్టత కల్గించినది. తనచుట్టు వందిమాగధులవలె ననుచరులు తిరుగుచుండుట యాయన కిష్టములేదు. అది తన ప్రతిష్ఠకు భంగకరమని యాయన యుద్దేశము. ఆయన ప్రతివిషయములోను స్వీయోద్దేశముల ప్రకారమే వ్యవహరించును. ఆయనది యొక మానిసిపార్టీ.

సర్దార్ పటేల్ పుట్టుకతోనే సంచాలకుడు. అది స్వభావసిద్ధమని యాయన భావించుచుండును. చతురత, సంఘటనాశక్తిద్వారా యాయన తన బలగమును బలుకుబడిని సాధించుకొనెను. ఆయన నెమ్మదిగా కాంగ్రెసు సంస్థను సంఘటిత మొనర్చెను. ఇప్పుడు దాని నాయనయే నడుపుచున్నాడు.