పుట:2015.329863.Vallabaipatel.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

132

వల్లభాయిపటేల్

విడివిడిగాఁ జూచుకొన్న రెండు విరుద్ధభావములేమో యని భ్రమ కల్పించునంత విపరీతములు. కాని పరిపూర్ణతా పుష్టమైన యేకశక్తి, ద్విధాగతరూపము నంది పరస్పరపోషకముగా నైన విచిత్ర సంస్థ - ఆ యిరువుర కూటమి.

మాహాత్ముఁడీ నాయకులను దేశమున కప్పజెప్పుటలోఁ దన ప్రతిభను జూపించినాఁడు దేశభక్తి, గురుదేవుఁడగు మహాత్మునియందు భక్తి; యీ సూక్తులే వారిరువుర నేకము చేయు దృఢబంధములు. ఈ యిరువుర స్వభావముల తార తమ్య వైచిత్రిని, సంకలనాలబ్ధపరిపూర్ణతను, డాక్టరు బాలకృష్ణకేస్కారుగా రీ వ్యాసములోఁ జక్కగాఁ జిత్రించిరి.

"భారతదేశమును బ్రస్తుత మావరించియున్న గందరగోళము, ననిశ్చితమై నిరంతరము మారుచున్న వాతావరణములలోఁ బండిట్ జవహర్‌లాల్‌నెహ్రూ, సర్దార్ వల్లభ్ణాయి పటేలును చలాయించుచున్న యనితరలభ్యాధికార మొక్క టే నిశ్చితముగా, స్పష్టముగాఁ గన్పడుచున్నది.

"వారిద్దరు భారత దేశసంయుక్త నియంతలని చెప్పవచ్చును. కాని యా యధికారమును వా రెట్టి కుతంత్రముద్వారా సంపాదించి యుండలేదు. పరిస్థితులు వారి కీ యధికారమును గైవసమొనర్చినవి. ఈనాడు ప్రభుత్వములోను, బయటను సర్వము వారే నడుపుచున్నా రనుట నిస్సందేహము. మహాత్మాగాంధీ జీవించియుండఁగానే నాయన వీ రిద్దరిని సమన్వయ పఱచుచుండెడివాఁడు. వీ రిద్దరు నాయన మహావ్యక్తిత్వము ద్వారానే యుత్తేజము పొందినారు. ఆయన పరమపదించిన తరువాత భారతభాగ్యవిధాతలు వీరే యైనారు.