పుట:2015.329863.Vallabaipatel.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

8

వల్లభాయిపటేల్

యుదాహరణము. ఆ స్వాతంత్ర్యసమరమున ‘మలహర రా’వను నొక స్వదేశసంస్థానాధీశునిచే నాయన ఖైదునం దుంచఁ బడెను. ఒకనాఁ డా కారాగృహప్రాంగణముననే యా మహారాజు చదరంగ మాడుచుండెను. ఆయన యెత్తులలోఁ దప్పులు చూపి మంచి యెత్తులు చెప్ప సాగినాఁడు జవేర్భాయి. తుదకు మహారాజు జవేర్భాయి సాయము వలననే యాటలో గెలుపొందెను. అంతట మహారాజు జవేర్భాయిపై ననుగ్రహము కలవాఁడై యిట్టి వివేకసంపన్నుని బందిగా నుంచుట తగదని విడుదల చేయించెను.

జవేర్భాయిలో ధైర్యసాహసములతోపాటు భగవద్భక్తి కూడ నుండెను. ఆహార విహారాదులలో నాయన యతి జాగరూకత కలిగి యుండువాఁడు. నియమనిగ్రహములు కలుగుటచే మంచి యారోగ్యవంతుఁడై తొంబది రెండేండ్లు జీవింపఁ గలిగెను.

ఆపదలలో నమాంత మతిధైర్యముతో దూకునట్టి సాహసము, ప్రతిభ, కష్టసహిష్ణుత మొదలగు గుణగణము లన్నియు వల్లభాయికిఁ బితృపాదులనుండి సంక్రమించినవి.

జవేర్భాయికాఱుగురు సంతానము - అందైదుగురు కుమారులు; ఒక కుమార్తె. ప్రథముఁడు సోమాభాయి, ద్వితీయుఁడు నరసీభాయి. తృతీయ చతుర్థులు విఠలభాయి, వల్లభాయులు - ఐదవవాఁడు కాశీభాయి - కూతురు పేరు దహీబేను, చిన్నతనములోనే చనిపోయినది. నాలుఁగవవాఁడగు వల్లభాయి 1875 సంǁ అక్టోబరు 31 తేదీన జన్మించెను.