పుట:2015.329863.Vallabaipatel.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

వల్లభాయిపటేల్

లక్ష్యమని తెలిపెను. 1942 ఆగస్టు 8 వ తేదీన బొంబైనగరమున నఖిలభారత కాంగ్రెసు సంఘము క్విట్ ఇండియా తీర్మానమునుజేసెను. ఈ యుద్యమము నడుపుట యెట్లా యని యగ్ర నాయకు లాలోచించుచుండగా, ఆగస్టు 9 వ తేదీ అర్ధరాత్రివేళ వారి నందరి నరెస్టు చేసి చెరసాలలో బంధించెను.

తమకుఁ బ్రియులైననాయకులు ప్రభుత్వమువారిచే నర్ధరాత్రివేళ బంధింపఁబడుటచేఁ బ్రజలలో నలజడి యారంభమాయెను. ప్రజలు గాంధీజీ బోధించిన యహింసాసిద్ధాంతమును విస్మరించి దౌర్జన్య పద్ధతులతో నాంగ్లేయులఁ దరిమివేయఁ గృత నిశ్చయులైరి. ప్రభుత్వ భవనములను, రైళ్లను, గూలద్రోయుటే గాక, దేశములో గొప్పయలజడి, యరాచకము సాగెను. ప్రభుత్వమువారు ప్రజానాయకులను నిర్బంధించుటచే దేశములో స్వాతంత్ర్యోద్యమము సన్నగిల్లునని తలఁచిరికాని ప్రజలుద్రిక్తులై విప్లవము సాగించిరి. ఈ ప్రజా విప్లవమే ఆగస్టు విప్లవమని విఖ్యాతి గాంచినది.

కాంగ్రెసు నాయకులను, గాంధీజీని విడుదలచేయవలయునని దేశమున గొప్పయాందోళన చెలరేగెను. దీనికిఁదోడుగా భారతీయ నాయకులను విడిపించి వారితో రాజీపడవలెనని, అమెరికా చీనాల అధ్యక్షులును, బ్రిటిషు ప్రధానిని దొందర చేసిరి. 1944 నాటికి భారతదేశమునకు యుద్ధప్రమాదము పోయినది. 1944 మేలో గాంధీజీ నస్వస్థతకారణముచే విడుదల చేసిరి. క్రొత్తవైస్రాయి వేవెల్ గాంధీజీతో రాజీయత్నము చేయగాఁ గాంగ్రెసు కార్యసమితి సభ్యుల విడుదలఁజేసినఁగాని తాను రాజీలోఁ బాల్గొననని పల్కెను.