పుట:2015.329863.Vallabaipatel.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

93

సంకల్పముతో వ్యవహరించుటవల్లనేమి, మన మా మహావిపత్తులన్నిటిని దాటి బయటఁబడగలిగితిమి. ఆ ధీరోదాత్త గుణసంపద మనకుఁ గొఱవడనంతవఱకు, సుశిక్షితులైన సైనికుల వలె, బాధ్యతాయుతముగా మనము ప్రవర్తించినంతవఱకు, భవిష్యత్తు విషయమై మన మాశతో మెలఁగవచ్చును.

"భారత స్వాతంత్ర్య ప్రథమవార్షికోత్సవము జరుగుచున్న యీనాఁడు మన మనుసరించుచున్న యభ్యుదయమార్గములో మఱొక మజిలీ చేరుకొన్నాము. ఈ సందర్భములో నొక్కసారి మన పూర్వాపరములను సమీక్షించుకొనుట సమంజసము. గత సంవత్సరము స్వాతంత్ర్యము సిద్ధించిన యీ రోజున మన హృదయము లెట్లుప్పొంగినవో యొకమాఱు జ్ఞప్తి చేసికొందము. ఆ మరుక్షణమునుండియే మనలను ముంచి వేసిన కష్టపరంపరలు, పాకిస్థాన్‌లోఁ దమ సర్వస్వమును గోల్పోయి నిరాశ్రయులై లక్షలకొలది శరణార్థులు కట్టుగుడ్డలతోఁ దండోపతండములుగా నిండియన్ డొమినియన్‌కుఁ దరలి వచ్చుట, మన మనుగడనే భగ్నముచేయుటకు మనదేశములోనే కొంతమంది ప్రయత్నించుట, సుఖవిలసితమైన కాశ్మీర్ మాగాణములో శాంతియుతముగా జీవయాత్ర సాగించుచున్న నిస్సహాయప్రజలపైఁ బొరుగు దేశమునుండి దుండగీం డ్రమానుష కృత్యములు జరుపుట, నిజాం సైనికదళముల యండ దండలతో ఫాసిస్టుమూఁకలైన రజాకార్లు మన సరిహద్దులలోఁ బశుకృత్యములు కావించుట, స్వాతంత్ర్యము పొందిన తొలి సంవత్సరములోనే మనల నెదుర్కొన్న యితర క్లిష్ట జటిల సమస్యలు - వీని నన్నిటి నొక్కమారు జ్ఞప్తి చేసికొనుఁడు.