పుట:2015.328620.Musalamma-Maranam.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

ముసలమ్మ మరణము


నాజ్ఞయొసఁగ నేనొసఁగ; నీవలుగ వలవ
దింతి నాముద్దు చెల్లింపవేని విడువ. 52

వ. అనిన నయ్యింతి చింతాక్రాంతయై, “కట్టా! యెట్టిమాటల విననయ్యెఁ! బ్రాణేశ్వరుని పలుకులు వినవిన బాలసూర్యోదయమ్మున విఱుగుమంచువోలె మన్మనోనిశ్చయము కరుగుచున్నది. ఇక నీశ్వరుఁడే నా హృదయమున ధృతినూరఁ జేయుచుండవలయు” నని చింతించి, ధైర్యం బవలంబించి, యా శుకవాణి తిన్నని యెలుంగేర్పడ నించుక కఠినంబుగా నిట్లు మందలించె. 53

గీ. ఎఱిఁగి యెఱిఁగి మీర లీరీతి వాక్రువ్వ
సంతసించితిరి ప్రశస్తభంగి![1]
మిమ్ముఁ జెప్పనేల? మీఱి నేనొడిఁ గట్టి
కొన్న పాపఫలముఁ గుడువకగునె? 54

ఉ. పెద్దలనాఁటినుండి కడు వేడ్కవసించిన యిండ్లవీడుటల్‌
వృద్ధులఁ దల్లిదండ్రులను వీధినిడించి చనంగఁ జూచుటల్‌
ముద్దుల సోదరుల్‌ వగవ మోదముతో సతిఁగూడి పోవుటల్‌
గద్దఱికంబొ కాదొ మదిఁ గాంచుఁడు వేఱుగఁ జెప్ప నేటికిన్‌. 55

శా. హేయంబైన ప్రపంచసౌఖ్యములు మిమ్మేలాగునంగట్టె? నా
థా! యత్యద్భుతమయ్యె; సంతతము నేదైవంబుగాఁ గొల్చు మీ
రే యిట్లాడిన నేమిచెప్పనగు? నన్నీసారికిం “బోయిరా
వే” యంచుందయఁ బంపవే; గుణనిధీ! యేనిన్నుఁ బ్రార్థించెదన్‌. 56

వ. అని వెడవెడ శంకవొడమ వెండియు నిట్లనియె. 57

  1. *పాఠాంతరము. తెఱఁగటంచుఁ దలఁచితిరి సుమ్ము.