పుట:2015.328620.Musalamma-Maranam.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

ఇప్పటికి రమారమి ఇరువది యైదేండ్లక్రింద శ్రీరామలింగారెడ్డిగారీచిన్నపొత్తమును ప్రకటించుకొనునధికారమును ప్రీతిపూర్వకముగా నాకొసంగిరి. నేనొక్కముద్రణము వేయించితిని. లఘుటీక చేర్చితిని. మధ్యకాలమున పునర్ముద్రణము చేయవలెనను కుతూహల ముండినదికాని నా స్వంతగ్రంథములకు పట్టిన యదృష్టమే నా సంపర్కము చేత దీనికిని బట్టినది. అనుదిన జీవిత మతిప్రయత్నముమీద గడుపుకొనునట్టిస్థితి నాకు చిరకాలముగ తప్పినదికాదు. కావున స్వంత పూచీమీద గ్రంథముద్రణము చేసికొనుట నాకు సాధ్యముకాలేదు. శ్రీ రామలింగారెడ్డిగారి షష్ఠిపూర్తి మహోత్సవసందర్భము తటస్థించినందున ఈ గ్రంథముద్రణమున కవకాశముకలిగినది. ఇది నా స్వశక్తిచే నిర్వహించినదిగాదు. ఆంధ్రదేశ గ్రంథాలయసంఘమునకు నేను అధ్యక్షుడుగానున్నాను. కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణము డిప్. లిబ్. గారును నేనును ఉదారచరితులగు శ్రీ రెడ్డిగారికి మా యుద్యమముపరముగా నేరూపమున నీషష్ఠిపూర్తిలో గౌరవముచూపి కృతజ్ఞతను వెల్లడించగలమా యని యాలోచించితిమి.

చంద్రునకొక నూలిపోగన్నట్లు ఈ గ్రంథము షష్ఠిపూర్తి ముద్రణమువేసి వారి కందియ్యదలచితిమి. గ్రంథాలయోద్యమధర్మము ప్రాతకాలపు పండితులధర్మము. విజ్ఞానము సర్వజనులకును వ్యాపింపజేయుట వారివిధి. ఆ విధియే మా యదియు. పండితుల కెట్టులచ్చి యచ్చిరాదని లోకోక్తికలదో అట్టులే మా యుద్యమమునకును లచ్చి యచ్చిరాలేదు. రాజాశ్రయమున్న శ్రీనాథుని గతి మాదికాదు. పొలముదున్నుకొని బ్రతికిన పోతన మా