పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

వెలుగోటి యాచమనాయఁడు

కృష్ణప్పనాయఁడు కూడ పాండ్యునిపాటుఁ జూచి భీతచిత్తుఁ డై తనయుద్యోగస్థులెల్లరు నవ్వుచుండ విధిని దూఱుకొనుచుఁ బాఱిపోయె నఁట ! తమ మిత్రులందఱుఁ బలాయను లగు చుండుటను జూచియు దళవాయిచెండు, రావిళ్ళ వెంకు, మాక రాజు మొదలగు శత్రుయోధులు ఏనుఁగు ఘంటలతోడను, రక్తప్రవాహములతోను రణరంగమంతయు భీభత్సముగా గన్పట్టుచుండ నాదృశ్యము నెన్నఁడు చూడనివా రగుట ధైర్యమును గోల్పోయి పక్కబలముచూసి కాళ్లకు బుద్ధి చెప్పిరి. మధురనాయకుఁ డగువీరప్పనాయని బంధించి సైనికులు రఘునాథరాయని సమ్ముఖమునకుఁ గొనిరాఁగా నాతఁడు వానిప్రాణములను గాఁచెనఁట! ఈ విజయమును సూచింపుచు రఘునాథనాయఁడు విజయస్తంభమును గావేరీ తీరమునఁ బ్రతిష్ఠాపించెను. హతశేషు లయిన శత్రునాయకు లెల్లరును రామదేవరాయలను శరణు వేడుకొనవలసినవా రయిరి. తరువాత నాసంవత్సరముననే యథావిధిగ రఘునాథనాయఁడు రామదేవరాయలను సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తుని గావించెను. రామదేవరాయల ప్రాణములను శత్రువులచేఁ జిక్కకుండఁ గాపాడి యాచమనాయఁడును సామ్రాజ్యము నిలువంబెట్టి రఘునాథనాయఁడును శాశ్వతమైనయశస్సును సంపాదించుకొనఁగల్గిరి.

సమాప్తము.

రాజన్ ఎలెక్ట్రిక్ ప్రెస్, రాజమండ్రి. 1952