పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

75

నభివర్ణించి యున్నాఁడు. యాచమనాయని సైన్యములు రఘునాథనాయని సైన్యములను జేరకుండుట కై జగ్గరాయలు ప్రోత్సహించినందువలన మధురవీరప్పనాయఁడు కావేరి కడ్డముగాఁ గట్టఁబడిన పెద్దయానకట్టనుగూడ బ్రద్దలు కొట్టి నాశనము గావించె నని సాహిత్యరత్నాకరమునందును, రామభద్రాంబ విరచిత మగు రఘునాధాభ్యుదయమునందును, గూడఁ దెలుపఁబడి యుండెను. ఈ సందర్భమున రాజ విద్రోహ పక్షమువారు చేసిన దుండగములను జెప్ప నలవికాదు. ఇంత చేసినను యాచమనాయఁడును, రఘునాథనాయఁడును వీరి ప్రయత్నముల నన్నిటిని భగ్నము గావించి విజయపతాక మెత్తుట తప్పినది కాదు.

యాచమనాయఁడు రామదేవరాయనివెంటనిడుకొని వచ్చుచున్నాఁ డని విని తాను తన సైన్యములతో కుంభకోణమునకుఁ బోయి వారలను గలిసికొని కుంభకోణము నందు రామదేవరాయలను బట్టాభిషిక్తునిఁ జేయుటకు నిశ్చయించికొని రాజ్యపరిపాలనాభారము నంతయు మంత్రియగు గోవిందదీక్షితుల పైఁ బెట్టి బయలు వెడలెను.

అట్లు బయలువెడలి రఘునాథనాయకుఁడు కుంభకోణమువద్ద రామదేవరాయలను వానిరక్షకుఁ డగుయాచమనాయనిఁ గలిసికొని వారలను తంజావురికిఁ గొనివచ్చెను. విజయనగరసామ్రాజ్యము దక్షిణభాగముననున్న చోళమండలము వారొక్కరు తక్క తక్కిన వారెల్లరును సామ్రాజ్యవిద్వేషు