పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
67
వెలుగోటి యాచమనాయఁడు

నీకు పాపము లేదు. ఇంతకన్న నా కేమియుఁ గోరిక లేదు. నా కోరిక దీర్పుము" అని ధైర్యముతో నామె వేఁడికొనెను.

అంత రంగరాయలు మాఱుమాట పలుక లేదు. తన చద్రాయుధముతో నామె వక్షఃస్థలమును బొడిచివైచెను. వానికుమాళ్ళ నిరువురను, ఒక కుమార్తెను, నట్లే గావించెను. ఇం కొకయాడుబిడ్డ గలదు. ఆబిడ్డ యేడువ లేదు. రాయల కాబిడ్డయందెక్కువ మక్కువ యుండెను. ఆబిడ్డ విచారముతో తండ్రినిఁ జూఁచుచు నిలువంబడి యుండుటను జూచి రంగరాయలు గిఱ్ఱున వెనుకకుఁ దిరిగి కత్తితోఁ తన వక్షఃస్థలమును పూర్ణమైన సత్తువతోఁ బొడుచుకొని క్రిందికొఱఁగి ప్రాణములను విడిచెనఁట! ఆపాపాత్ముఁ డగు జగ్గరాయనితమ్ముఁడు మరణముఁ జెందిన రాయనిబిడ్డ బ్రతికియుండరా దని మానుషత్వమును విడిచి తనఖడ్గముతో నాచిన్ని యాడుబిడ్డనుగూడఁ ద్రుంచివైచెనట! ఈ విధానము పోర్చుగీసువారి లేఖలు సారాంశమునుబట్టి వ్రాయఁబడినది.

కాని యొకనాటిరాత్రి ద్రోహి యైనజగ్గరాయలే వారి కారాగృహమును బ్రవేశించి నిద్రపోవుచున్న రంగరాయని, వానిభార్యను, బిడ్డలను సంహరించిరని యాకాలమున రచింపఁబడిన సాహిత్యరత్నాకరము, రఘునాథాభ్యుదయ మను గ్రంథములనుఁబట్టి తెలియు చున్నది. ఎట్లయినను యాచమనాయనిచే సరంక్షింపఁబడిన రాకుమారుఁడు తక్క రంగరాయని కుటుంబమంతయు నాతనితో నీవిధముగా