పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

వెలుగోటి యాచమనాయఁడు

నిర్వహించి వత్తు" నని బయలువెడలిపోయెను.

ఇట్లాతఁడు తన్ను తా నెఱుంగని చిత్తముతో మానుషస్వభావమును సంపూర్ణముగా విడిచిపెట్టి రాక్షసాకృతి వహించి రంగరాయ లున్నప్రదేశమును వెదకికొనుచుఁ బోయి యాతని వీక్షించి "ఓయీ! రంగా! నేటితో నీకు కాలము పరిసమాప్తిఁ జెందినది. ఆ పని నీకత్తితో నీవు తీర్చుకొందువా? ఆ కార్యము మఱియొకఁడు తీర్పవలయునా? వెంటనే ప్రత్యుత్తర మిమ్ము. ఇంక జాగుసేయఁ దగదు." అని గట్టిగా నొత్తి పలికెను.

వీని యాకృతిని వీక్షించియు, వీని క్రూరము లయిన వాక్కుల నాలించియు క్షాత్రవంతునికుండు ధైర్యమును వీడక యాతనితో 'ఓయీ నేను మరణముతో నాకన్నులను మూయులోపల నాభార్యను, బిడ్డలను జూడవలయు నని యున్నది. నా కావర మొసంగవా? యని పలికెను.

అంత భార్యయు, బిడ్డలును నాతనికడకు వచ్చిరి. వారలనుఁ జూచి విచారింపక తెగువతో శాంతవచనముల నిట్లు పలికెను. 'నే నిపుడు చావవలయును. నే నెవ్వరికి నెట్టి యపకృతియుఁ జేసి యుండలేదు. అన్యాయముగా నొకరి సొత్తు నేను దీసికొన లేదు. చా వన్న భయము నాకు లేశమాత్రములేదు.' అని పలికెను.

"ప్రభూ! అట్లనే కానిమ్ము. నన్ను నీ శత్రువులబాఱి పడకుండ ముందుగ ద్రుంచివేయుము. అదియె నా కోరిక;