పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

61

మనాయనిఁ జేరుటకు సంకల్పించుకొని తమనిశ్చితాభిప్రాయమును యాచమనాయనికిఁ దెలియఁజేసిరి.

ఇట్టి శుభవార్త వినవచ్చినపుడు యాచమనాయని యుత్సాహ మినుమడించి రంగరాయని నె ట్లయిన విడిపించవలయునని యభిలాష మరల యుదయించెను. తనకు విశ్వాసపాత్రులును తెలివితేటలు గలిగి నేర్పరు లయిన యువకులను గొందఱను రప్పించి వారల కిట్లు బోధించెను. "మీరు రంగరాయని చెరశాలయున్న దుర్గమునకుఁబోయి మీ నేర్పరి తనముఁ జూపి యాదుర్గములో నుద్యోగములు సంపాదించుటకుఁ బ్రయత్నింపుఁడు. ఈ కార్యమునందు మీకు జయము గలిగినపక్షమున రహస్యముగా నితరులకు గానరాకుండు నటుల వెలుపలనుండి రాయలుండు గృహములోనికి భూమిలోపల నొకసొరంగమునుఁ ద్రవ్వి రంగరాయని దీసికొని రావలయును. మీకర్హ బహుమానములను విరివిగాఁ జేయింపఁగలను."

అని చెప్పి వారిని పంపించెను. ఆతని యాజ్ఞను శిరసావహించి వారు పోయి తమ నేర్పరితనమునుజూపి, యుద్యోగములను సంపాదింపఁగలిగిరి. ఈ ప్రయత్నమునందు విజయము లభించినందువలనఁ దమ ప్రభువుమీదఁ గల భక్తి విశ్వాసములు వెల్లడి యగునట్లు తాము వచ్చినకార్యమునకుఁ బూనుకొని యా సొరంగమును ద్రవ్వి యొకనాటిరాత్రి రంగరాయని గదిక్రిందికివచ్చి యుపరిభాగమును బెల్లగించి గదిలో