పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

59

మిక్కిలిగమాసి యంటువడి యున్న గుడ్డలను గప్పి యతిసాహసముతో నాగంప నెత్తికొని వచ్చినదారిని పోయెను. కావలి వారతని నెఱింగినవా రగుటచేతను ప్రతిదిన మట్లు చాకలి వాండ్రు పోవుచుండుట చేతను వారి కెట్టి యనుమానమును గలుగకుండుటచే యధాప్రకారము ద్వారములగుండఁ బోనిచ్చిరి. అతఁ డంటుగుడ్డలు మోసికొని పోవుచున్నాఁ డని యితరు లందఱును వానికి దూరముగాఁ దొలఁగుచు వచ్చిరి గాని యెవ్వరికి నెట్టివిధ మైనయనుమానమును గలుగలేదు.

అట్లు చాకలివాఁడు నిరాటంకముగా నిర్భయుఁ డై కోటనుదాటి యొక రహస్య ప్రదేశమునకుఁ గొనిపోయి వానిని బయటకుఁ దీసి యాబాలుఁడు తనకు నాతనికి నెట్టి విధమైన విపత్తు గలుగకుండ నట్టికష్టమున కోర్చియుండినందు కాతఁ డదృష్టవంతుఁ డని భావించి శ్లాఘించుచు నాప్రదేశముననే మూఁడుదినము లుండునట్లునియమించి నాల్గవనాఁ డెవ్వరికిఁ దెలియకుండ నాతని యాచమనాయని చెంతకుఁ జేర్చెను. అంతటి మహోపకారమును గావించినందుకు వానిని మెచ్చికొని తాను చెప్పిన ప్రకారము కొంతధన మొసంగి రామదేవుని పట్టాభిషిక్తుని గావించిన వెనుక తనవాగ్దత్తము సంపూర్ణముగా నెఱవేర్తునని చెప్పి వానిప్రాణమును గాపాడుట కభయప్రదానముగూడఁ జేసెను.

అటుపిమ్మట నెద్దియో కపటోపాయమున రంగరాయల రెండవకుమారుని యాచమనాయఁడు తనచెంతకుఁ