పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

57

చేయుచున్న యుద్ధసన్నాహమునకును భయపడి ప్రత్యుత్తర మిచ్చుటకు నేమియుఁ దోఁపక జగ్గరాయలు తదితరసామంత మండలాధిపతులను స్తోత్రపాఠములుఁ జేయుచుఁ, గౌరవించుచు వారల నందఱ నేకీభవింపఁ జేసి యేకాకి యై యెదిరించుచున్న యాశత్రువీరునిఁ దలపడి నాశనము జేయవచ్చు నన్నయాశతో నుండెను.

ఇంతలో యాచమనాయఁడు చెఱలో నున్న తన ప్రభువును విడిపించు టెట్లని యాలోచించు చుండెను. ఒక దుర్మార్గుని చేతిలోఁ బూర్తిగాఁ జిక్కిపోయి యితరుల కెవ్వరికిఁ జొఱరాని కారాగృహంబున నున్నవాని విడిపించుటకుఁ బ్రయత్నించునపుడు వాని కెట్టివిధమైన హానియుఁ గలుగకుండఁ జూడ వలయునుగదా! ఎన్నివిధములఁ బ్రయత్నించినను కార్యము కొనసాఁగ దయ్యెను.

ఇట్లుండ నాతనిమనంబున కొక యోచన తట్టెను. ఏదైన నుపాయముచేత రంగరాయలపుత్రులలో నొకనినైన నీవలకు వచ్చునట్లు చేసి యాతనినే రాయలుగాఁ బ్రకటించి పట్టాభిషిక్తునిఁ జేయుట యుక్తమని భావించెను. అందు కొక యుపాయమును జింతించెను. పదభ్రష్టుఁ డైనరాయలకును, వాని కుటుంబమునకును బట్ట లుతుకుటకై నియమింపఁబడిన చాకలివానివలన యీ కార్యమును నిర్వహింప సాహసించెను. ఒకనాఁడు రహస్యముగా చాకలివానిని రప్పించి ఓయీ! నీవు రంగరాయని పుత్రులలో మొదటికుమారుఁడు, పెద్దవాఁడు