పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

విశ్వనాథనాయకుఁడు

భావముతోనే సామ్రాజ్యప్రతినిధికి సర్వవిధముల తోడ్పడి కృషిసలిపెనుగాని స్వతంత్రభావముతో నుపేక్షించియుండలేదు. విఠ్ఠలరాయలుగాని, అతనితమ్ముఁడు చినతిమ్మరాజుగాని విశ్వనాథనాయనివారి పరిపాలనమునకుఁ బ్రతిబంధకముగా నెద్దియును జేసియుండ లేదు. విశ్వనాథనాయనివారును, విఠ్ఠలరాయలును పరస్పరము సఖ్యభావమును జూపుకొనుచు నైక మత్యముతో వ్యవహరించినట్లు గన్పట్టుచున్నది గాని విరోధ భావములతో గూడియుండి యనైకమత్యముతో వ్యవహరించినట్లు గనుపట్టదు. మహామండలేశ్వర రామరాయ విఠ్ఠలరాయ దేవమహారాజునకుఁ దాను కార్యకర్తనని విశ్వనాథనాయని వారి యొక శాసనమునఁ గన్పట్టినను విఠ్ఠలరాయనికి విశ్వనాథనాయనివారు సామంతుఁడుగా నుండి పరిపాలించెనని చెప్పరాదు. విశ్వనాథుఁడు పాండ్యరాజ్యాధిపత్యము వహించిన రాజుమాత్ర మైయున్నాఁడు. తిరువడిరాజ్యమును, పోర్చుగీసు వారి సముద్రతీరప్రాంతదేశమును సామ్రాజ్యమునుండి తొలఁగి పోకుండ జూచుటకై ముఖ్యముగాఁ బంపఁబడినవాఁడు విఠ్ఠల దేవరాయలు. ఈతఁడును, నీతనితమ్ముఁడు చినతిమ్మరాజును, వీరియనుచరు లయిననాయకులు కొందఱును చేసిన దాన శాసనములు కొన్ని పాండ్యరాజ్యమందును గానవచ్చుచుండుటచేత నీతనిసమ్మతిని గైకొనియె చేయఁబడి యుండవచ్చును గాని యంతకన్న వానికి వేఱగువిపరీతార్థము లిచ్చువ్యాఖ్యానములు చేయరాదు.