పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వనాథనాయకుఁడు

19

చుండఁ దన యభిప్రాయమంతయు విస్పష్ట మగునట్లుగా 'మహా ప్రభూ! ఈ రాజ్యపరిపాలనము నావలన నగునది కాదని నే నెఱుంగుదును; ఒకవేళ నే నీరాజ్యమును కోరినా చోళరాజు నన్నుఁ బ్రాణముతో విడిచిపెట్టువాఁడు కాఁడు; ఇదియుఁగాక మాతండ్రితాతలకు నుంపుడుసంబంధాలవలనఁ బుట్టినవారు శ్రీవిల్లిపుత్తూరు, తెంగాశి, రాచపాళియము మొదలగుస్థలములలో నున్నవారు; వారు నన్ను తలయెత్తుకొననీయరు; నాగమనాయనివారు సయిత మన్నిస్థలములను సాధింపగలిగినారు. కాని యైదుస్థానములను సాధించలేకపోయినారు. ఇంతకు నా పగవాండ్రయిన చోళునకుగాని వీరలకుఁగాని రాజ్యము నొసంగక నాబదులుగా విశ్వనాథనాయనివారే యేలుకొనుట నాకు పరమసంతోషముగా నుండును. ఇపుడు విశ్వనాథనాయనివారు నాతండ్రివంటివాఁడు గావున నన్ను శత్రువుల బాఱిపడకుండ సంరక్షింపఁగలఁడు. నాస్థితినిబట్టి గౌరవమర్యాదలకు భంగములేకుండ నన్ను బోషించినఁజాలు' మమి విన్నవించుకొనియెను.

కృష్ణదేవరాయలవా రందులకు సమ్మితించి విశ్వనాథనాయనివారిని గాంచి యిట్లు పలికిరి.

ఇదివరకు నీవు మాకును, మా సామ్రాజ్యమునకును పెక్కులుపకృతులు గావించి యున్నావు. ఇంతియగాక మీ తండ్రిగారు మమ్మును లక్ష్యముసేయక మాయాజ్ఞను నిరాకరించినపుడు స్వామికార్యమే పరమ ధర్మమని యెంచి