పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

విశ్వనాథనాయకుఁడు

రాఁబడి వృద్ధిచేసి సకలవిధముల రాజ్యమును బందోబస్తూచేసిన వెనుక తమవద్దకు ఫిర్యాదు చేసికొనుటకు వచ్చినాఁడు." అని యావద్విషయములను విపులముగా విన్నవించి సత్యమును శ్రుతపఱిచెను. అటుపిమ్మట రాయలవారు చంద్రశేఖరపాండ్యుని గాంచి నిజ మేమని ప్రశ్నించెను. ఇదంతయు సత్యమే యని యతఁ దొప్పుకొనియు మర్యాదగా జీవనము జరపుకొనుటకు భంగము గలిగినది గావున దేవరవారితో మనవిచేసికొనవలసి వచ్చినదని మొఱవెట్టుకొనియెను. మొదటనే యిట్లేల చెప్పవైతి వని రాయ లాగ్రహము పడియెను. ఏమిచేసినను పాండ్యుని క్షమింపుఁడని విశ్వనాథనాయఁడు రాయలనుఁ బ్రార్థింపఁగా నాతఁడు క్షమించి యూరకుండెను.

"మహాప్రభూ! నే నింక నీపాండ్యరాజ్యమును బరిపాలింపఁజాలనని యూహించి నాగమనాయనికుమారుఁడైన యీ విశ్వనాథనాయనికి నారాజ్యమునుఁ బరిపాలించుకొమ్మని వ్రాసి యిచ్చినాను. ఇప్పటికి నామాట తప్పియుండ లేదు. ఈ రాజ్యమునకు విశ్వనాథనాయనివారిని ప్రభువును గాఁవించి పట్టముఁగట్టిన నాకునుఁ బరమసంతోషకరమె యగు" నని చంద్రశేఖరపాండ్యుఁడు రాయలతో విన్నవించుకొనియెను.

"తండ్రి యని యించుకయైన సంకోచింపక స్వామి కార్యమునుఁ బ్రధానముగాఁ దలంచి చెఱపట్టిగొనివచ్చి సమర్పించినవాఁడవు గనుక నిన్నుఁ జూచి మీతండ్రిని క్షమించి