పుట:1857 ముస్లింలు.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉన్నా సరే అవమానకరమైన శిక్షలతో, చిత్ర హింసలతో నిర్ధాక్షిణ్యంగా ఆంగ్లేయులు అంతం చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాద్‌ యోధుడు మౌల్వీ లియాఖత్‌ అలీ ఖాన్‌ సాయుధంగా తిరుగుబాటు చేసి అలహాబాద్‌ పరగణాకు విముక్తి ప్రసాదించారు. పాలనాధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన హిందూ-ముస్లిం యోధులతో కలసి సమాఖ్య తరహా పాలనచేశారు. చివరకు నమ్మకద్రోహం వలన ఆంగ్లేయ సైనికులకు చిక్కడంతో ఆయనను చిత్రహింసలు పెట్టి చివరకు అండమాన్‌ దీవులకు పంపారు.
చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రతినిధులుగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలతో తలపడిన కులీన వర్గాలకు చెందిన ప్రముఖులు, నవాబులు, స్వదేశీ పాలకులు ఎవ్వరూ కూడా బ్రిటీష్‌ ప్రభుత్వ వ్యతిరేకత పర్యవసానం గురించి ఆలోచించలేదు. బ్రిటీష్‌ ప్రభుత్వం శక్తి సామర్ధ్యాలు, ఆంగ్ల సైన్యం బలసంపన్నత మున్నగువాని విూద లేశమంతైనా దృష్టి సారించలేదు. మాతృభూమి విముక్తి కోసం బహదూర్‌ షా జఫర్‌ నేతృత్వంలో సాగుతున్న పోరులో పాల్గొనటం తప్ప మరో విషయాన్ని తమ మదిలోకి ఏమాత్రం రానివ్వక పోరుబాటన ముందుకు నడిచారు.
ఈ సందర్భంగా ఢిల్లీలోని ముస్లిం జనసముదాయాలు తమ ధనమాన ప్రాణాలను పణంగా పెట్టి స్వదేశీ యోధులకు తోడ్పడ్డారు, ఆంగ్లేయ సైనికులతో కలబడ్డారు. ఈ వీరోచిత కృత్యాలు ఎంతటి మహాత్తర స్థాయిలో ఉన్నా, అటు ప్రజలను ఇటు స్వేచ్ఛకోసం కత్తిపట్టి కదనరంగంలో శత్రువును తునుమాడేందుకు సిద్ధపడిన సైనిక శక్తులను, పాలనాధికారులను సమన్వయపర్చగల సమర్థవంతమైన నాయకత్వం కరువు కావడంవల్లా, స్వపక్షంలోని విభిషణ పాత్రధారుల కుయుక్తుల వల్లా ఆంగ్లేయుల విూద పూర్తి ఆధిపత్యం సాధించలేకపోయారు.
చివరకు మొగల్‌ సింహాసనం విూద మోజుతో అంతర్గత కలహాలకు కారకులైన మొగల్‌ పరివారంలోని కొందరి వలన పరాయి పాలకుల పంచన విలాసవంతంగా బ్రతుకుదాం అనుకున్న విద్రోహుల చర్యల మూలంగా స్వదేశీ యోధుల త్యాగాలు వృధా అయిపోయాయి. చివరి ఘట్టంలో విద్రోహుల వలలో చిక్కిన మొగల్‌ ప్రభువు బహదూర్‌ షా జఫర్‌ పోరాట యోధుడు భక్తఖాన్‌ యిచ్చిన సలహా పెడచెవిన పెట్టి కంపెనీ పాలకులకు లొంగి పోవడంతో తిరుగుబాటుకు ప్రధాన కేంద్రంగా మారిన ఢిల్లీ నగరం సెప్టెంబరు 19న తిరిగి ఆంగ్లేయుల వశమయ్యింది.