పుట:1857 ముస్లింలు.pdf/284

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైన త్యాగాలు

భావాలు నీ ముఖకవళికల్లో స్పషంగా గోచరించాయి. అయితే నీవంతతో విరమించుకోక దృఢనిశ్చయంతో నిలిచావు. ఏదోవిధంగా వీలు చూసుకుని లక్నో కాంగ్రెసులో నాతో మాట్లాడావు...నీ మిత్రులతో చెప్పించి నాకు నమ్మకం కలిగించ ప్రయత్నించావు. చివరకు నీవే నెగ్గావు. నీ ప్రయత్నాల వలన నా హృదయంలో నీకు చోటు దొరికింది, అని రాసుకున్నారు.(బిస్మిల్‌ ఆత్మకధ, హిందీ మూలం శ్రీ రాం ప్రసాద్‌ బిస్మిల్‌, తెలుగు సేత శ్రీ ఇంగువ మల్లికార్జున శర్మ, మార్క్సిస్టు అధ్యయన వేదిక, హైదారాబాదు,1989, పేజి.105).

మాతృభూమి విముక్తి కోసం ఉద్యమంచిన జాతీయోద్యకారులలో కూడా ముస్లింల పట్ల అనుమానం, వ్యతిరేకభావనలు ఏ మేరకు బలపడిపోయాయో ఈ సంఘటనల ద్వారా విదితమౌతుంది.

అలనాటి బ్రిటిష్‌ చరిత్రకారులు, ఆ చరిత్రకారుల రచనలను భూమికగా తీసుకుని చరిత్ర రచన సాగించిన స్వదేశీ చరిత్రకారులు ఆ ప్రభావం వల్ల సృజనాత్మక రచయితలు-కవులు సృష్టించిన ముస్లిం వ్యతిరేక సాహిత్య ప్రచారం కారణంగా రూపొందిన కళలు-కళారూపాల వలన సామాన్య ప్రజలలో ముస్లిం వ్యతిరేక మనస్తత్వం గాఢంగా స్థిరీకరించబడింది. ఈ రకమైన ముస్లిం వ్యతిరేక ప్రచారం మూలంగా ఆనాడు, ఈనాడు కూడా ముస్లింల పట్ల ఒకరకమైన వ్యతిరేకత పెంచి పోషించబడుతుంది. ఈ ప్రచారాన్ని ఎదుర్కోడానికి నిర్మాణాత్మక కృషి జరగక పోవడంతో ముస్లిం వ్యతిరేకత కాస్త మరింత బలం పుంజుకుని మత మనోభావాలను రచ్చగొట్టి అధికార పగ్గాలను చేప్టాలనుకుంటున్న శక్తులకు-వ్యక్తులకు ఆలంబన అవుతోంది.

ఈ మనస్తత్వం మరింతగా ప్రచారం కాకుండా సుమిత్‌ సర్కార్‌, తానికా సర్కార్‌, బి.యన్‌.పాండే, ఒంకార్‌ ప్రసాద్‌, సుధీర్‌ చంద్ర, కెకె ఘటక్‌, బిపిన్‌ చంద్ర, రొమిల్లా థాపర్‌, హర్బన్స్‌ ముఖియా, ఇర్పాన్‌ హబీబ్‌, అథర్‌ అలీ, ఇందీవర్‌ కాంవేకర్‌ లాంటి ప్రముఖ చరిత్రకారులు, రచయితలు కొంత మంది చరిత్రకు సంబంధించిన వాస్తవాలను వెల్లడి చేస్తూ రచనలు చేస్తూన్నారు. ఆ దిశగా సాహిత్య సృష్టి జరుగుతున్నా అది అనుకున్నంత స్థాయిలో, అవసరమున్నంత పరిమాణంలో జరగక పోవటం వలన శతాబ్దాలుగా సాగిన దుష్ప్రచారాన్ని కూకటి వేళ్ళతో పెళ్ళగించ లేకుంది. ఈ ప్రయత్నం అవసరవున్నంత బలంగా లేకపోవటం వలన ముస్లిం విద్వేషకుల, ముస్లిం వ్యతిరేకశక్తుల ఆటలు సాగుగుతున్నాయి. ముస్లిం ప్రజలను, ప్రభువులను అపఖ్యాతి పాల్జేయగల వ్యాఖ్యానాలు అతి సులువుగా ముస్లిం వ్యతిరేక శక్తులు-వ్యక్తులు ప్రకటిస్తున్నారు.

281