పుట:1857 ముస్లింలు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలకు చేరువకాని సమాచారం

అందువలన సాధారణ చరిత్ర గ్రంథాలలో త్యాగధనులైన ముస్లింలు చాలా వరకు కన్పించరు. ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి సాహసం, త్యాగాలు, అతి సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడ్డాయి. బహుళ ప్రాచుర్యంలో ఉన్న పాపులర్‌ చరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాథలు సరైన స్థానం పొందలేక పోయాయి. ఆయా కథనాలు ప్రాంతీయ చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్య పుస్తకాలలోగాని సక్రమంగా చోటు చేసుకోలేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు అలనాటి అమూల్య సమాచారం అందకుండా పోయింది.

సామాన్య చరిత్ర గ్రంథాల ద్వారా తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళారూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముస్లింల శ్లాఘనీయ త్యాగ చరిత్రలు కథా వస్తువు కాలేకపోయాయి. ఆ కారణంగా ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత పోరాట ఘట్టాలకు మన సాహిత్యంలో సరైన స్థానం లభించలేదు. కళా-సాహిత్య మాధ్యమాల ద్వారా జనబాహుళ్యంలోకి వారి త్యాగాలు ప్రసరించకపోవటం వలన ఆ తరువాతి తరాలకు ఆయా చారిత్రక విషయాలు తగినంతగా పరిచయం కాలేదు.</poem>