పుట:1857 ముస్లింలు.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సందర్భంగా భారతావనిలోని ప్రధాన సాంఘిక జనసముదాయాలైన హిందూ- ముస్లింల మధ్య పటిష్టమైన ఐక్యత వ్యక్తమైంది. ఈ ఐక్యతను గమనించిన బ్రిటీష్‌ పాలకులు కలవరపడ్డారు. ఈ ఐక్యత తమ అధికార ప్రాభవవైభవాలకు గొడ్డలి పెట్టు కాగలదని భయపడిన ఆంగ్లేయులు విభజించు-పాలించు కుటిల నీతిని అమలుపర్చి, చరిత్రను వక్రీకణలకు గురిచేసి, పలు కుయుక్తులకు పాల్పడి మొత్తం విూద భారతీయులను మతం పేరుతో మానసికంగా హిందువులు-ముస్లింలుగా విభజించటంలో కృతకృత్యులయ్యారు.
ఈ ప్రయత్నాలలో భాగంగా ముస్లింల విూద అసత్యప్రచారాలను అంబరాన్ని అంటేదాకా సాగించారు. ఆ ప్రచారాలకు అక్షరరూపం కల్పించి నిక్షిప్తం చేసి స్థిరపర్చారు. ఆ ప్రవాహంలో స్వదేశీ చరిత్రకారులు కొట్టుకపోయారు. చివరకు ఆంగ్లేయుల కుట్ర ఫలించి ఇండియా విభజన వరకు సాగింది. ఈ విధంగా విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ సందర్భంగా జరిగిన దారుణాలు, పొరుగు దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు తదుపరి ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు అలనాటి ఐక్యతకు తూట్లు పొడిచి విభిన్న జన శ్రేణులలో పరస్పరం ఉన్న సద్భావనకు చిచ్చుపెట్టాయి.
ముస్లిం సమాజం విూద మోపబడిన విభజన అను రుజువుకాని కాలేని నేరం సృష్టించిన ప్రత్యేక మానసిక పరిస్థితి చరిత్రకారులను, రచయితలను కూడా తాకింది. భారత విభజనానంతర పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయబడిన ముస్లిం సమాజం సుషుప్తావస్థలోకి నిష్క్రమించింది. ఆ కారణంగా విశృంఖలంగా ప్రచారమౌతున్న అపోహలను-అసత్యాలను ఆ దిశగా సాగుతున్న అనుచిత చర్యలను ముస్లిం సమాజం వాస్తవాలతో బలంగా తిప్పికొట్టలేకపోయింది. ముస్లిమేతర సమాజానికి తన పూర్వీకుల మహత్తర త్యాగమయ పాత్రను వివరించలేకపోయింది.
చరిత్రకారులు, పరిశోధకులు కూడా అసత్యాల జడివానలో కునారిల్లుతున్న ముస్లింలకు సంబంధించిన నిజానిజాలను నిర్ధారించి ప్రజలకు వాస్తవాలు అందించ లేకపోయారు. అలనాడు తమ స్వార్థం కోసం వలసవాద చరిత్రకారులు సృష్టించిన ముస్లిం వ్యతిరేక చరిత్ర అక్షర రూపంలో స్థిరపడినందున ఆ ప్రభావం నుండి స్వదేశీ చరిత్రకారులు కూడా బయటపడ లేకపోయారు. అందువలన ముస్లిం యోధుల త్యాగ చరితలు అక్షర రూపంలో నిక్షిప్తం కాలేకపోయాయి.