Jump to content

పుట:1857 ముస్లింలు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 1

ముస్లింలు

1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్రసంగ్రామం భారతదేశ చరిత్రలో మహోజ్జ్వల ఘట్టం. భారతీయుల పోరాట పటిమకూ, శౌర్యప్రతాపాలకూ, నిరుపమాన దేశభక్తికి నిలువుటద్దం. ఈ పోరాటంలో, భారతదేశపు అతిపెద్ద అల్ప సంఖ్యాక వర్గమైన ముస్లిం సమాజం అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందిస్తూ ముందుకు సాగింది. ఈ పోరులో అగ్రభాగాన నిలచి ఆదర్శవంతమైన పాత్రను నిర్వహించి ఇతర జనసముదాయాలకు తలమాణికమయ్యింది. ముస్లిమేతర సాంఘిక జన సమూహాలతో మమేకమై, పరాయి పాలకులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున సాగిన సమరంలో నాయకత్వ పాత్రను చేపట్టి తన విద్యుక్త ధర్మాన్ని అపూర్వమైన రీతిలో నిర్వర్తించింది.

ఈ పోరాటంలో అపూర్వ త్యాగాలతో, అసమాన బలిదానాలతో ముస్లింలు పునీతులయ్యారు. ఆడ-మగ, బాలుడు-వృద్ధుడు తేడా లేకుండా సమరశీల పాత్ర నిర్వహిస్తూ, ఎక్కడా రాజీపడకుండా తమ ప్రాణాలను బలిపెట్టి స్వదేశం నుండి వలస పాలకులను తరిమి కొట్టాలన్న దృఢ సంకల్పంతో అనిర్వచనీయమైన త్యాగాలతో చరిత్ర సృష్టించారు. చివరకు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇస్లామిక్‌ కుట్ర అని ఆంగ్లేయులు భావించినంతటి ప్రధాన పాత్రను నిర్వహించారు.