పుట:1857 ముస్లింలు.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లేయుల రాక్షసత్వం

సమానంగా శిక్షలు విధించారు. ఆంగ్లేయుల పట్ల గతంలో ఏమాత్రం కఠినంగా వ్యవహరించిన వ్యక్తిగాని, బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కించిత్తు విమర్శించిన వ్యక్తిగాని ఎక్కడ కన్పించినా ఆ వ్యక్తులను నరకయాతన పెట్టి అంతమొందించ సాగారు. ఆంగ్లేయులకు ఎదుటపడిన వ్యక్తుల విషయంలో దోషి నిర్దోషి అను వివక్ష లేదు. తెల్లవాడు కాక మిగిలిన వారు-నల్లగా కన్పించినా, స్థానికుడన్పించినా అతడ్ని దోషిగా పరిగణించడం, ఆ మరుక్షణమే తుపాకీగాని, కత్తికి గానీ బలిపెట్టడం యధేచ్ఛగా సాగింది.

నగర ప్రముఖులు, సంపన్నులు, తిరుగుబాటుతో ఏమాత్రం సంబంధంలేని కులీన పండిత కుటుంబాలు ఏవీ కూడ ఆంగ్ల సైనికుల దాష్టీకాల నుండి తప్పించుకోలేకపోయాయి. ప్రతి ఇంటినీ ఆంగ్ల సైనికులు చుట్టుముట్టారు. ప్రతి ఇంటిని దోచుకున్నారు. ప్రతిఘటించినా, ప్రతిఘటించకపోయినా గృహస్తులను చంపి వేశారు. ఈ హత్యాకాండ, అత్యాచారాల నుండి తప్పించుకునేందుకు సంపన్న-కులీన వర్గాలకు చెందిన మహిళలు తమ గృహాలలోని ప్రత్యేక గదులలో, రహాస్య ప్రదేశాలలో పెద్ద సంఖ్యలో దాక్కొన్నారు.

ఆ విధంగా దాక్కొన్న వారెవ్వరినీ వదలి పెట్టకుండా వెతికి వెతికి మరీ వేటాడటంతో ఆంగ్ల సైనికుల బారిన పడకుండేందుకు మరోమార్గం లేక పిల్లాపాపలతో సహా మహిళలు బావులలో దూకి, నదులలోకి గెంతి ఆత్మహత్యలు చేసుకున్నారు. మగవారు చావుకు సిద్ధపడి బయటకు వచ్చి కాల్పులు జరుపుతూగాని, చస్తూ చస్తూ తమ ఆయుధాలతో శత్రువును బలితీసుకుంటూ మృత్యు మాలలను స్వయంగా ధరించారు. మూడు వారాల పాటు ఢిల్లీ నరంలో ఆంగ్ల సైనికుల ఇష్టారాజ్యం సాగింది. ఆంగ్లసైనికుల, ఆంగ్లేయాధికారుల అకృత్యాలను భయానక దారుణ మారణకాండకు గురైన కుటుంబాలు, ఆ కుటుంబాలలోని వ్యక్తులు, ఆ వ్యక్తుల స్థాయి, అమాయకత్వం, ఆ వ్యక్తుల-కుటుంబాల పాపపుణ్యాలతో సహా పూసగుచ్చినట్టుగా మొయినుద్దీన్‌ హసన్‌ తన ‘గదర్‌ 1857’ గ్రంథంలో సవివరంగా పేర్కొన్నాడు.

ఆంగ్ల సైనికుల అత్యాచారాల నుండి తప్పించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో తమ గృహాల మాగళిలో, చిన్న చిన్న గదులలో కూడ కిక్కిరిసిపోయి దాక్కొన్నారు. భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఎంతగా

దాగినా ఎవ్వర్నీ వదలకుండా అందర్నీ తమ గృహాల నుండి బయటకు లాక్కొచ్చి బాయెనెట్

201