పుట:1857 ముస్లింలు.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ముందు ఆ ఫిరంగి, దానితోపాటు ఫిరంగి దళం బాధ్యతలను చూస్తున్న హిందూ సిపాయిలు హిందూ మతాచారాల ప్రకారంగా పూజలు నిర్వహించదలిచారు. ఆ సమయంలో హిందూ-ముస్లిం సిపాయిలు ఎవ్వరూ కూడ ఆ పూజా కార్యక్రమాలను కాదనలేదు.

ఆ సందర్భంగా పూజారులు మంత్రాలు చదివి హారతిచ్చి ఇతర పూజా కార్యక్రమాలను పూర్తిగా నిర్వహించి ఆశీర్వాదం పలికిన తరువాత ఆ ఫిరంగిని శతృవు మీద ప్రయాగించడానికి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ-ముస్లిం సైనికులు మాత్రమే కాకుండా చక్రవర్తి బహదాూర్‌ షా జఫర్‌ ఇతర నవాబులు, స్వదేశీ ప్రముఖులు కూడ పాల్గొన్నారు. మతం పేరుతో హిందూ-ముస్లింల ఐక్యతను విఛ్చిన్నం చేసి తిరుగుబాటును పూర్తిగా అణచివేయాలనుకుంటున్నఆంగ్లేయులకు ఈ ప్రవర్తన మింగుడు పడలేదు. ప్రజలూ-ప్రభువులూ కూడా తమ మత ఆచార సంప్రదాయాలను పక్కన పెట్టి మత మనోభావాలకు అతీతంగా ఏకమై ఒకేమాట- ఒకేబాటగా వ్యవహరించడంతో ఆంగ్లేయ సైనికాధికారులకు దిమ్మతిరిగిపోయింది.

నిప్పూ - నీరు సహజీవనం ! ఆ !!

ఈ విధంగా వ్యక్తమైన హిందూ-ముస్లింల ఐక్యత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వయంగా పాల్గొన్న ఆంగ్ల అధికారులను, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల లోని మేథావులను కూడా ఆశ్చర్యానికి లోనుచేసింది. ఉమ్మడి సమస్యల మీద కూడా హిందూ-ముస్లింలు ఏకమయ్యే ప్రసక్తే లేదని భావిస్తూ వచ్చిన ఆంగ్లేయులకు 1857 పోరాటంలో వ్యక్తమైన ఐక్యత తీవ్ర విభ్రాంతికి గురిచేసింది.

ఆంగ్లేయులు అసాధ్య మని భావించిన దాన్ని భారతీయులు సాధ్యమని బలంగా రుజువుచేశారు. హిందూ-ముస్లింలను 'నిప్పూ-నీరు' గా భావించి ఈ రెండు సముదాయాల మధ్యసయోధ్య ఖచ్చితంగా అసాధ్యమని నిశ్చింతగా ఉన్న కంపెనీ పాలకులకు ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం, ఉమ్మడి శత్రువు మీద పోరాటానికి మేమంతా ఎప్పుడూ ఒక్కటేనని ఆచరణాత్మకంగా రుజువు చేసిన ప్రజలు ఆంగ్లేయులకు చక్కని గుణపాఠం చెప్పారు.

190